ICC Rankings : దీప్తి, రేణుక ర్యాంక్‌లు మెరుగు

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గ్రూపు దశలోనే నిష్ర్కమించిన విషయం తెలిసిందే.

Update: 2024-10-15 12:38 GMT

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గ్రూపు దశలోనే నిష్ర్కమించిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీలో సత్తాచాటిన భారత బౌలర్లు దీప్తి శర్మ, రేణుక సింగ్ తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. ఐసీసీ మంగళవారం మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బౌలర్ల విభాగంలో స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి ఒక్క స్థానం ఎగబాకగా, రేణుక రెండు స్థానాలు అధిగమించింది. ఇద్దరూ చెరో 740 రేటింగ్ పాయింట్లతో 3వ స్థానాన్ని పంచుకున్నారు.

ఇంగ్లాండ్ బౌలర్ ఎక్లోస్టోన్ 765 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. అగ్రస్థానానికి దీప్తి, రేణుక 20 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నారు. మరో భారత స్పిన్నర్ శ్రేయాంక ఏకంగా 10 స్థానాలు వెనక్కినెట్టి 19వ ర్యాంక్‌కు చేరుకుంది. బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన 5వ స్థానాన్ని కాపాడుకుంది. టీ20 ప్రపంచకప్‌లో స్మృతి అంచనాలను అందుకోలేకపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 75 పరుగులే చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 11వ ర్యాంక్‌కు చేరుకోగా.. షెఫాలీ వర్మ ఒక్క స్థానాన్ని కోల్పోయి 12వ ర్యాంక్‌కు పడిపోయింది. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 4వ స్థానంలో ఉన్నది. 

Tags:    

Similar News