ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్..! సన్ రైజర్స్ పై పగ తీర్చుకుంటాడా..

ఐపీఎల్‌ టీం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం కారణంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే.

Update: 2023-02-23 10:17 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్‌ టీం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం కారణంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. అతను, ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఆడటం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. జట్టు కొత్త సారథిగా ఎవరిని నియమిస్తారనే చర్చ జరిగనప్పటికీ ఆ విషయంపై జట్టు యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ఢిల్లీ క్యాపిటల్స్ డిసైడ్ అయిందట.

ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను నియమించాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్య బోర్డు నిర్ణయించిందట. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ 2016లో ఆ జట్టుకు ట్రోఫీ కూడా అందించాడు. కానీ 2021లో పేలవ ఫామ్ చూపించడంతో అతన్ని సీజన్ మధ్యలోనే నిర్దాక్షిణ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పించేసింది సన్‌రైజర్స్ యాజమాన్యం. అక్కడితో ఆగకుండా అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది. కనీసం డగౌట్‌కు కూడా రానివ్వకపోతే.. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సన్‌రైజర్స్‌కు మద్దతిచ్చాడు ఈ స్టార్ ప్లేయర్. అందుకే ఇప్పటికీ అభిమానులు అతనే తమ కెప్టెన్ అంటున్నారు.

ఇలా సన్‌రైజర్స్ జట్టుతో బంధం తెంచుకున్న వార్నర్ 2022 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరాడు. ఈ జట్టు తరఫున అద్భుతంగా రాణించాడు. 12 మ్యాచుల్లో 432 పరుగులు చేశాడు. దీనిలో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే పంత్ గైర్హాజరీలో అతనికే జట్టు పగ్గాలు ఇవ్వాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించింది. ఇది చూసిన అభిమానులు.. వార్నర్ ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌పై పగ తీర్చుకుంటాడని, ఆ జట్టుపై రెచ్చిపోయి ఆడతాడని అంటున్నారు. మరి అతను ఎలా రాణిస్తాడో చూడాలి.

Tags:    

Similar News