దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీపై ఒక్క పరుగు తేడాతో యూపీ విజయం

డబ్ల్యూపీఎల్ సీజన్-2లో యూపీ వారియర్స్ వరుసగా రెండు పరాజయాల తర్వాత పుంజుకుంది.

Update: 2024-03-08 18:55 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో యూపీ వారియర్స్ వరుసగా రెండు పరాజయాల తర్వాత పుంజుకుంది. తొలి గ్రూపు మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో యూపీకి విజయం దక్కింది. ఢిల్లీ వేదికగా శుక్రవారం చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీపై యూపీ గెలుపొందింది. మోస్తరు లక్ష్యాన్ని యూపీ బౌలర్లు కాపాడుకున్నారు. 139 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ మరో బంతి మిగిలి ఉండగానే 137 పరుగులకే ఆలౌటైంది. ఛేదనను ధాటిగా ప్రారంభించిన ఓపెనర్ మెగ్ లానింగ్(60) హాఫ్ సెంచరీతో చెలరేగింది. అయితే, మరో ఎండ్‌లో ఆమెకు సరైన సహకారం అందలేదు. షెఫాలీ వర్మ(15), ఎలీస్ క్యాప్సే(15) స్వల్ప స్కోరుకే నిరాశపరిచారు. అయితే, ఒక దశలో 111/3 స్కోరుతో ఢిల్లీ జట్టు విజయం సాధించేలా కనిపించింది. చివరి మూడు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సి ఉండగా.. దీప్తి శర్మ ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. లానింగ్‌‌ను అవుట్ చేసిన కాసేపటికే రోడ్రిగ్స్(17)ను పెవిలియన్ పంపింది. అక్కడితే శాంతించని ఆమె 19వ ఓవర్‌లో సదర్లాండ్(6), అరుంధతి రెడ్డి(0), శిఖా పాండే(4)ను అవుట్ చేసింది. చివరి ఓవర్‌లో 10 పరుగులు కావాల్సి ఉండగా గ్రేస్ హ్యారిస్ అద్బుతంగా బౌలింగ్ చేసింది. రాధా యాదవ్(9), జొనాస్సెన్(11), టిటాస్ సాధు(0) వికెట్లు పారేసుకోవడంతో ఢిల్లీ మరో బంతి ఉండగానే కుప్పకూలింది. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా..సైమా ఠాకూర్, గ్రేస్ హ్యారిస్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఎక్లోస్టోన్‌కు ఒక వికెట్ దక్కింది.

దీప్తి ఒంటరి పోరాటం

అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌ను దీప్తి శర్మ ఆదుకుంది. ఢిల్లీ బౌలర్ల ధాటికి యూపీ మొదటి నుంచి తడబడింది. ఓపెనర్ హీలీ(29) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. కిరణ్ నవ్‌గిరే(5), మెక్‌గ్రాత్(3), గ్రేస్ హ్యారిస్(14), శ్వేతా సెహ్రావత్(4) దారుణంగా విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో దీప్తి శర్మ(59) ఒంటరి పోరాటం చేసింది. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆమె హాఫ్ సెంచరీతో పోరాడింది. శిఖా పాండే వేసిన చివరి ఓవర్‌లో ఆమె క్యాచ్ అవుటైంది. దీప్తి పోరాటంతో యూపీ జట్టు నిర్ణీత ఓవర్లలో 138/8 స్కోరు చేసింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ : 138/8(20 ఓవర్లు)

(దీప్తి శర్మ 59, రాధా యాదవ్ 2/16, టిటాస్ సాధు 2/23)

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 137 ఆలౌట్(19.5 ఓవర్లు)

(మెగ్ లానింగ్ 60, దీప్తి శర్మ 4/19, గ్రేస్ హ్యారిస్ 2/8, సైమా ఠాకూర్ 2/30)

Tags:    

Similar News