పంత్ రీఎంట్రీకి సమయం ఆసన్నమైంది.. నెట్స్‌లో చెమటోడ్చిన రిషబ్
2022 డిసెంబర్‌లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్న అతను ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న పంత్.. ఎం. చిన్నస్వామి స్టేడియంలో సహచరులను కలుసుకున్నాడు. బెంగళూరు వేదికగా బుధవారం భారత్, అఫ్గనిస్తాన్ జట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం మంగళవారం బెంగళూరుకు చేరుకున్న భారత ఆటగాళ్లు ఎం.చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రింకు సింగ్‌లతో పంత్ మాట్లాడాడు. అనంతరం పంత్ నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే, అతను బౌలర్లను ఎదుర్కోలేదు. త్రోడౌన్ సెషన్‌లో పాల్గొన్నాడు. దాదాపు 20 నిమిషాలపాటు బ్యాటింగ్ చేశాడు. అయితే, అతను ఏమాత్రం అసౌకర్యంగా కనిపించలేదు. పంత్ బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పంత్ రీఎంట్రీకి సమయం ఆసన్నమైందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.