క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్‌పై కన్నేసిన గుకేశ్

క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ టైటిల్‌కు అడుగుదూరంలో ఉన్నాడు.

Update: 2024-04-21 13:31 GMT

దిశ, స్పోర్ట్స్ : కెనడాలో జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ టైటిల్‌కు అడుగుదూరంలో ఉన్నాడు. చివరి రౌండ్‌కు ముందు అతను ఒంటరిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన 13వ రౌండ్‌లో గుకేశ్ ఫ్రాన్స్‌కు చెందిన అలిరెజా ఫిరౌజ్జా‌ను ఓడించాడు. తెల్లపావులతో ఆడిన అతను ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ఆడిన అతను 63 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. ఈ విజయంతో గుకేశ్ 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ఆఖరిదైన 14వ రౌండ్‌లో హికారు నకమురా(అమెరికా)తో తలపడనున్నాడు.

ఈ గేమ్‌లో గెలిస్తే అతను చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్(2014) తర్వాత టైటిల్ గెలిచిన భారత క్రీడాకారుడిగా నిలువనున్నాడు. అలాగే, 17 ఏళ్ల గుకేశ్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీదారుడిగా నిలిచిన పిన్న వయస్కుడిగా ఘనత సాధిస్తాడు. మరోవైపు, ఫాబియానో కరువానా(అమెరికా) చేతిలో ఆర్‌.ప్రజ్ఞానంద ఓడిపోగా.. నిజత్ అబాసోవ్(అజార్‌బైజాన్)తో విదిత్ గుజరాతి డ్రా చేసుకున్నాడు. ఉమెన్స్ విభాగంలో ఆర్.వైశాలి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 13వ రౌండ్‌లో లీ టింగ్జీ(చైనా)ను ఓడించింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అన్నా ముజిచుక్‌తో పాయింట్లు పంచుకుంది. టోర్నీలో ఆమెకు ఇది 9వ డ్రా. పాయింట్స్ టేబుల్‌లో కోనేరు హంపి, వైశాలి సంయుక్తంగా మూడో స్థానంలో ఉండగా విజేతగా నిలిచే అవకాశాలు లేవు. 

Tags:    

Similar News