Paris olympics : కాస్ కీలక తీర్పు..అమెరికా క్రీడాకారిణికి కాదు.. ఆమెకే పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో రొమానియా జిమ్నాస్ట్ అనా బార్బోసు కాంస్య పతకం కోసం చేసిన పోరాటం ఫలించింది.

Update: 2024-08-11 14:25 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో రొమానియా జిమ్నాస్ట్ అనా బార్బోసు కాంస్య పతకం కోసం చేసిన పోరాటం ఫలించింది. కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్) ఆమెకు బ్రాంజ్ మెడల్ ఇవ్వాలని తీర్పునిచ్చింది. జిమ్నాస్టిక్ విభాగంలో ఈ నెల 5న మహిళల ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్ ఈవెంట్ ఫైనల్ జరిగింది. ఫైనల్‌లో సిమోన్ బైల్స్(అమెరికా) స్వర్ణం, రెబెకా ఆండ్రేడ్(బ్రెజిల్) రజతం సాధించగా.. జోర్డాన్ చిలెస్(అమెరికా) కాంస్యం గెలుచుకుంది. తాజాగా కాస్ తీర్పుతో కాంస్య విజేతలో మార్పు చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే.. ఫైనల్‌లో మొదట చిలెస్ 13,666 స్కోరుతో 5వ స్థానంలో నిలిచింది. అప్పుడు బార్బోసు 13,700 స్కోరుతో మూడో స్థానంలో ఉంది. చిలెస్ ప్రదర్శనను తప్పుగా నమోదు చేశారని ఆమె కోచ్ రివ్యూ కోరింది. రివ్యూ తర్వాత చిలెస్ 13,766 స్కోరుతో బార్బోసును వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరుకుని బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అయితే, చిలెస్ నిమిషం నిబంధన దాటిన తర్వాత రివ్యూ తీసుకుందని బార్బోసు కాస్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కాస్ ఆమె అప్పీల్‌ను సమర్థించింది. చిలెస్ పెంచిన స్కోరు చెల్లదని తీర్పునిచ్చింది. దీంతో 13,700 స్కోరు సాధించిన బార్బోసుకే కాంస్యం దక్కనుంది. ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్ ఫైనల్ ఫలితాలను సవరించనున్నట్టు ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్(ఎఫ్‌ఐజీ) తెలిపింది. దీనిపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) స్పందిస్తూ.. బార్బోసుకు కాంస్యం పతకం అందజేస్తామని తెలిపింది. 

Tags:    

Similar News