Ravichandran Ashwin: 'క్షమాపణలు కోరుతున్నా.. ఆ ట్వీట్‌ చేయడానికి కారణమిదే'

Update: 2023-08-24 12:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్‌ హీత్‌ స్ట్రీక్‌ మరణించాడంటూ బుధవారం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ఫాలోవర్లకు క్షమాపణలు చెప్పాడు. తన ట్వీట్‌తో తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమైనందుకు పేర్కొన్నాడు. జింబాబ్వే మాజీ పేసర్‌, స్ట్రీక్‌ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ ట్వీట్‌ కారణంగా క్రికెట్‌ అభిమానుల్లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. 49 ఏళ్ల హీత్‌ స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశాడని ఒలంగ తొలుత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేశాడు.

దీంతో అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా హీత్‌ స్ట్రీక్‌కు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు. అందులో రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఉన్నాడు. అయితే, తాను బతికే ఉన్నానంటూ స్ట్రీక్‌ ఒలంగకు మెసేజ్‌ చేయడం.. ఆపై అతడు కూడా తన పాత ట్వీట్‌ను డిలీట్‌ చేసి.. స్ట్రీక్‌ చనిపోలేదని.. థర్డ్‌ అంపైర్‌ అతడిని వెనక్కి పిలిచాడని మరో ట్వీట్‌ చేశాడు. దీంతో అభిమానులు ఒలంగపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తన పొరపాటును తెలుసుకున్న అశ్విన్‌ ఫాలోవర్లను క్షమాపణలు అడుగుతూ తాజాగా మరో ట్వీట్‌ చేశాడు. ‘‘హెన్రీ ఒలంగ ట్వీట్‌ చూసిన తర్వాత నేను విషాదంలో మునిగిపోయాను. ఆ చేదు వార్తను అస్సలు నమ్మలేకపోయాను. ఆ బాధలోనే ట్వీట్‌ చేశాను. అయితే, నిజం తెలిసిన తర్వాత ఆ ట్వీట్‌ను డెలిట్‌ చేశాను. హీత్‌ స్ట్రీక్‌ నీ ఆరోగ్యం జాగ్రత్త. నా ట్వీట్‌తో తప్పుడు సమాచారానికి కారణమైనందుకు క్షమాపణలు కోరుతున్నా’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.


Similar News