'నీ సైజుకు తగ్గ షార్ట్స్ కొనుక్కో'.. కోహ్లీతో ఫన్నీ ఇన్సిడెంట్‌ను రివీల్ చేసిన ఇషాంత్ శర్మ

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మొదటి పరిచయం చాలా సరదాగా జరిగిందని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు.

Update: 2023-06-25 15:11 GMT

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మొదటి పరిచయం చాలా సరదాగా జరిగిందని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. తాజా ఇంటర్వ్యూలో కోహ్లీని మొదటిసారి కలిసినప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ను ఇషాంత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. ‘నేను కోహ్లీని తొలిసారి ఢిల్లీ అండర్‌-17 ట్రయల్స్‌లో కలిశాను. అతను అప్పటికే అండర్-19కు ఆడుతున్నాడు. అతన్ని అప్పుడు ‘విరు’ అని పిలుస్తుండేవారు. వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో మా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉండటంతో నా బౌలింగ్‌లో చితక్కొట్టాడు. ఏదో విధంగా నేను అండర్-17 ట్రయల్స్‌కు ఎంపికయ్యాను. ఆ సమయంలోనే నేను వ్యక్తిగతంగా కోహ్లీని కలిసాను. అప్పుడు నేను చిన్న షార్ట్ వేసుకున్నట్టు గుర్తు. కోహ్లీ నన్ను చూసి ‘భాయ్.. నీ సైజుకు తగ్గ షార్ట్స్ కొనుక్కో’ అంటూ సరదాగా అన్నాడు. అప్పట్లో నేను చాలా సిగ్గుపడే వాడిని. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు.

ఢిల్లీ అండర్-17కు ఆడటం ఎంత పెద్ద విషయమో నాకు అప్పుడు తెలియాదు. ‘కనీసం రంజీ ట్రోఫీ అయినా ఆడితే ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది’ అని మా నాన్న చెబుతుండేవారు. కానీ, నేను టీమ్‌ ఇండియాకు ఆడతానని అప్పుడూ ఎవరూ ఊహించి ఉండరు’ అంటూ ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. సీనియర్ పేసర్ అయిన ఇషాంత్ శర్మ జాతీయ జట్టుకు ఆడి చాలా రోజులైంది. 2021లో న్యూజిలాండ్‌తో చివరి టెస్టు ఆడాడు. అయితే, ఐపీఎల్-16లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు.


Similar News