చితక్కొట్టిన బట్లర్.. ఇంగ్లాండ్‌కు వరుసగా రెండో విజయం

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

Update: 2024-11-11 12:16 GMT

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై వెస్టిండీస్‌కు వరుసగా రెండో ఓటమి. వన్డే సిరీస్ ఓటమికి ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకునే దిశగా సాగుతోంది. కెప్టెన్ బట్లర్(83) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో వరుసగా రెండో టీ20లోనూ ఆతిథ్య జట్టుకు షాకిచ్చి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా సోమవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో కరేబియన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. సాకిబ్ మహమూద్, లివింగ్‌స్టోన్, మౌస్లీ తలా రెండు వికెట్లతో విండీస్‌ను కట్టడి చేశారు. కెప్టెన్ పొవెల్(43) టాప్ స్కోరర్. రొమారియో షెఫర్డ్(22), మాథ్యూ ఫొర్డె(13 నాటౌట్), రోస్టన్ చేజ్(13) కీలక పరుగులు జోడించడంతో వెస్టిండీస్ కష్టం మీద ఇంగ్లాండ్ ముందు పోరాడే స్కోరు పెట్టింది.

మోస్తరు లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, ఛేదనలో ఫిలిప్ సాల్ట్(0) తొలి బంతికే అవుటవడంతో ఆ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కానీ, కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా బౌండరీలతో చెలరేగి జట్టును విజయానికి చేరువచేశాడు. బట్లర్ అవుటైనా.. లివింగ్‌స్టోన్(23 నాటౌట్) మెరుపులతో మిగతా పని పూర్తి చేశాడు. సిరీస్‌లో గురువారం మూడో టీ20 జరగనుంది. అందులోనూ గెలిస్తే సిరీస్ ఇంగ్లాండ్ వశమైనట్టే.    

Tags:    

Similar News