అమిత్, జైస్మిన్‌లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు

భారత బాక్సర్లు అమిత్ పంఘల్, జైస్మిన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

Update: 2024-06-02 15:56 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత బాక్సర్లు అమిత్ పంఘల్, జైస్మిన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో పురుషుల 51 కేజీల కేటగిరీలో అమిత్, మహిళల 57 కేజీల కేటగిరీలో జైస్మిన్ ఒలింపిక్ బెర్త్‌లు కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఒలింపిక్ కోటా బౌట్లలో వీరిద్దరూ గెలుపొందారు. అమిత్ 5-0 తేడాతో చైనా బాక్సర్ లియు చువాంగ్‌ను చిత్తు చేశాడు. జైస్మిన్ కూడా అంతే తేడాతో మాలి బాక్సర్ మెరైనా కమరాను ఓడించింది.

అయితే, మహిళల 57 కేజీల కేటగిరీలో పర్వీన్ హుడా ఇప్పటికే ఒలింపిక్ బెర్త్ సాధించగా.. ఆమెపై వాడా నిషేధం విధించడంతో భారత్ ఆ కోటాను కోల్పోయింది. దీంతో తిరిగి ఆ కోటాను సాధించేందుకు 60 కేజీల కేటగిరీలో పోటీపడే జైస్మిన్‌ను భారత బాక్సింగ్ సమాఖ్య 57 కేజీల కేటగిరీలో బరిలోకి దింపింది. పర్వీన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అద్భుత విజయాలతో భారత్‌కు తిరిగి ఒలింపిక్ బెర్త్‌ను సాధించిపెట్టింది.

మరో భారత బాక్సర్ సచిన్ సివాచ్‌కు నిరాశే ఎదురైంది. ఒలింపిక్ కోటా బౌట్‌లో మునార్బెక్ సెయిట్బెక్ ఉలు(కిర్గిజ్‌స్తాన్) చేతిలో 5-0 తేడాతో ఓడిపోయాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి చివరి టోర్నీ అయిన ఈ ఈవెంట్‌లో భారత్ మూడు బెర్త్‌లు సాధించింది. ఇప్పటికే నిశాంత్ దేవ్(71 కేజీలు) పారిస్ విశ్వక్రీడలకు అర్హత సాధించగా.. తాజాగా అమిత్, జైస్మిన్ ఆ జాబితాలో చేరారు. మొత్తం బాక్సింగ్‌లో భారత్‌కు ఆరు బెర్త్‌లు దక్కాయి. ఈ టోర్నీ కంటే ముందే నిఖత్ జరీన్(మహిళల 50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), లవ్లీనా బోర్గోహైన్(75 కేజీలు) ఒలింపిక్ బెర్త్‌లు సాధించిన విషయం తెలిసిందే.


Similar News