డబ్ల్యూటీసీ టైటిల్ నెగ్గడమే లక్ష్యం : టీమిండియా సీనియర్ బ్యాటర్
టీమ్ ఇండియా సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పూజారా ఆస్ట్రేలియాతో నేటి నుంచి జరగబోయే రెండో టెస్టుతో తన కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు.
న్యూఢిల్లీ: టీమ్ ఇండియా సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పూజారా ఆస్ట్రేలియాతో నేటి నుంచి జరగబోయే రెండో టెస్టుతో తన కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పుజారా మాట్లాడాడు. తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు 100వ టెస్టు మ్యాచ్ ఆడతానని ఊహించలేదన్నాడు.
ఈ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే తాను 100వ టెస్టు ఆడబోతున్నానని తనకు తెలిసిందని, కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉంటాయని ఆ సమయంలో పోరాటం చేయాలన్నాడు. '100వ టెస్టు ఆడటం నా లక్ష్యం కాదు. నేను ప్రతి టెస్టు మ్యాచ్‌లో రాణించాలనుకునే ఆటగాడిని. మంచి క్రికెట్ ఆడితే ప్రయాణంలో 100వ టెస్టు ఉంటుంది. 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నందుకు సంతృప్తిగా ఉత్సాహంగా ఉంది.
అయినా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది' అని పుజారా చెప్పాడు. అదే సమయంలో తాము ముఖ్యమైన సిరీస్ ఆడుతున్నామని, రెండో టెస్టుతోపాటు ఆ తర్వాతి మ్యాచ్ కూడా గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) టైటిల్ సాధించడం తన కల అని తెలిపాడు. గత ఎడిషన్‌లో తృటిలో టైటిల్ కోల్పోయినప్పటికీ ఈ సారి ఫైనల్‌కు అర్హత సాధించి ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు. కాగా, 100వ టెస్టు ఆడిన భారత క్రికెటర్ల క్లబ్‌లో పుజారా 13వ ఆటగాడిగా చేరనున్నాడు. తొలి టెస్టులో నిరాశపర్చిన పుజారా తన కెరీర్‌లో మైలురాయి లాంటి రెండో టెస్టులో సత్తాచాటాలనుకుంటున్నాడు.