ఫాలోఆన్ లో బ్లాక్ క్యాప్స్ భారీ స్కోరు: ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..?
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఫాలోఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు 162.3 ఓవర్లు బ్యాటింగ్ చేసి 483 పరుగులకి ఆలౌటైంది.
దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఫాలోఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు 162.3 ఓవర్లు బ్యాటింగ్ చేసి 483 పరుగులకి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 257 పరుగుల ఊరించే టార్గెట్ పెట్టింది. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో బాదుడే మంత్రంగా విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్, నాలుగో ఇన్నింగ్స్‌లో టార్గెట్‌ని ఎలా ఛేదిస్తున్నదే ఆసక్తికరంగా మారింది. ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్ జట్టును మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్, టామ్ లాథమ్, డివాన్ కాన్వే, టామ్ బ్లండెల్, డార్ల్ మిచెల్ కలిసి ఆదుకున్నారు. డివాన్ కాన్వే, టామ్ లాథమ్ కలిసి తొలి వికెట్‌కి 149 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ 83 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో అవుట్ కాగా 61 పరుగులు చేసిన డివాన్ కాన్వే, జాక్ లీచ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వెంటవెంటనే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది న్యూజిలాండ్ జట్టు. మిడిల్ ఆర్డర్‌లో విల్ యంగ్ 8, హెన్రీ నికోలస్ 29 పరుగులు చేసి నిరాశపరిచినా కేన్ విలియంసన్ 282 బంతుల్లో 12 ఫోర్లతో 132 పరుగులు చేసి కెరీర్‌లో 26 టెస్టు సెంచరీ అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో 7,684 పరుగులు పూర్తి చేసుకున్న కేన్ విలియంసన్, న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ (7,683 టెస్టు పరుగులు) రికార్డుని అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
డార్ల్ మిచెల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసి అవుట్ కాగా టామ్ బ్లండెల్ 166 బంతుల్లో 9 ఫోర్లతో 90 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. బ్రాస్‌వెల్ 8, టిమ్ సౌథీ 2, మ్యాన్ హెన్రీ డకౌట్ అయ్యారు. బ్రాస్‌వెల్ నిర్లక్ష్యంగా క్రీజులోకి వెళ్లిన తర్వాత కూడా కాలు కింద పెట్టేందుకు సమయం తీసుకుని రనౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్‌కి 5 వికెట్ల దక్కగా జో రూట్, హారీ బ్రూక్, స్టువర్ట్ బ్రాడ్, రాబిన్ సన్ తలా ఓ వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 87.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 224 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 153 పరుగులు చేయగా హారీ బ్రూక్ 176 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో 186 పరుగులు చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 209 పరుగులకే ఆలౌట్ అయ్యి ఫాలోఆన్ ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ టెస్టు కెప్టెన్ టిమ్ సౌథీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. ఫాలోఆన్ ఆడుతూ న్యూజిలాండ్ తరుపున టాప్ స్కోర్ చేసిన నాలుగో బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు కేన్ విలియంసన్..