గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా బెత్ మూనీ.. వైస్ కెప్టెన్‌గా స్నేహ్ రాణా

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ గుజరాత్ జెయింట్స్ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ బెత్ మూనీని తిరిగి నియమించింది.

Update: 2024-02-14 18:58 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ గుజరాత్ జెయింట్స్ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ బెత్ మూనీని తిరిగి నియమించింది. ఈ విషయాన్ని బుధవారం ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అలాగే, భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్టు తెలిపింది. గతేడాది జరిగిన ప్రారంభ ఎడిషన్‌లో గుజరాత్ కెప్టెన్‌గా మూనీనే నియామకమైంది. అయితే, తొలి మ్యాచ్‌లో గాయపడిన ఆమె లీగ్ మొత్తానికి దూరమైంది. దీంతో స్నేహ్ రాణా పగ్గాలు చేపట్టింది. అయితే, రెండో సీజన్‌కు మూనీ అందుబాటులోకి రావడంతో ఫ్రాంచైజీ తిరిగి ఆమెనే సారథిగా నియమించగా.. స్నేహ్ రాణాకు వైస్ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించింది.

కాగా, గతేడాది ఆరంభ ఎడిషన్‌లో గుజరాత్ జెయింట్స్ పేలవ ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింట మాత్రమే నెగ్గింది. పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచింది. రెండో ఎడిషన్‌లో సత్తాచాటాలని గుజరాత్ జెయింట్స్ భావిస్తున్నది. బెత్ మూనీ తిరిగి రావడం ఆ జట్టుకు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 23 నుంచి డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ప్రారంభకానున్న విషయం తెలిసిందే. గుజరాత్ జెయింట్స్ తన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోబోతున్నది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత ఎడిషన్‌లోనూ గుజరాత్ జెయింట్స్ తన తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌తోనే ఆడగా.. పరాజయం పాలైంది. 

Tags:    

Similar News