బెంగాల్ వారియర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం బెంగాల్ వారియర్స్ పోరాడుతోంది.
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం బెంగాల్ వారియర్స్ పోరాడుతోంది. కీలక మ్యాచ్‌లో యు ముంబైపై గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబాపై 34-46 తేడాతో బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. మొదటి నుంచి ఈ మ్యాచ్‌లో బెంగాల్‌దే పైచేయి. ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా పాయింట్లు సాధించడంతో ఫస్టాఫ్‌లో 20-13 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే, సెకండాఫ్‌లో యు ముంబా పుంజుకుంది. దీంతో ప్రత్యర్థి నుంచి బెంగాల్ ప్రతిఘటన ఎదుర్కొంది. అయితే, ఏ మాత్రం పట్టు వదలని బెంగాల్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుని 12 పాయింట్ల తేడాతో నెగ్గింది. బెంగాల్ తరపున మనిందర్ సింగ్ 10 పాయింట్ల సత్తాచాటగా, నితిన్ కుమార్, విశ్వాస్ చెరో 8 పాయింట్లతో రాణించారు. ఈ విజయంతో బెంగాల్ పాయింట్స్ టేబుల్‌లో 54 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నది. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఆ జట్టు హర్యానా స్టీలర్స్‌తో పోటీపడుతుంది.
మరోవైపు, టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కొనసాగుతోంది. యూపీ యోధాస్‌పై 30-67 తేడాతో భారీ విజయం సాధించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన జైపూర్ మ్యాచ్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. రైడర్ అర్జున్ 20 పాయింట్లతో చెలరేగాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన జైపూర్ ఈ విజయంతో అగ్రస్థానానికి వెళ్లింది.