దేశవాళీ టోర్నీల ప్రైజ్‌మనీ భారీగా పెంపు.. బీసీసీఐ కీలక నిర్ణయం
భారత దేశవాళీ సీజన్ 2023-24 షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: భారత దేశవాళీ సీజన్ 2023-24 షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ టోర్నీల విజేతలతోపాటు రన్నరప్‌లకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారత క్రికెట్‌కు వెన్నుముక అయిన దేశీయ క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటామని జై షా తెలిపారు. బీసీసీఐ తాజా నిర్ణయంతో రంజీ ట్రోఫీ విజేతకు రూ. 5 కోట్లు దక్కనున్నాయి.
ఇప్పటివరకు రూ. 2 కోట్లు ఇచ్చేవారు. రన్నరప్‌కు రూ. కోటి నుంచి రూ. 3 కోట్లకు పెంచారు. అలాగే, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ విజేతలకు రూ. కోటి ఇవ్వనుండగా.. రన్నరప్‌లకు రూ. 50 లక్షలు అందనున్నాయి. ఇరానీ కప్, ప్రొఫెసర్ దేవ్‌ధర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత, రన్నరప్ ప్రైజ్‌మనీని కూడా పెంచారు. అలాగే, మహిళల క్రికెట్ టోర్నీ ప్రైజ్‌మనీని బీసీసీఐ భారీగా పెంచింది. వన్డే ట్రోఫీ విజేతకు ఇప్పటివరకు రూ. 6 లక్షలు ఇవ్వగా.. ఇకపై రూ. 50 లక్షలు అందజేయనుంది. టీ20 ట్రోఫీ విజేత ప్రైజ్‌మనీని రూ. 5 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు.