బీసీసీఐకి సవాల్‌గా మారనున్న ఐపీఎల్-2024 నిర్వహణ

ఐపీఎల్-2024 మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 22 నుంచి భారత టీ20 లీగ్‌కు తెరలేవనుంది.

Update: 2024-03-16 20:10 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 22 నుంచి భారత టీ20 లీగ్‌కు తెరలేవనుంది. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. వచ్చే నెల 19 నుంచి జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రెండో దశ షెడ్యూల్‌పై బోర్డు ఫోకస్ పెట్టనుంది. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లకు షెడ్యూల్, వేదికలు ఖరారు చేయడం బీసీసీఐకి తలనొప్పిగా మారనుంది.

ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్‌లో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. బీసీసీఐ ఇంకా 53 మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారు ఖరారు చేయాల్సి ఉంది. అయితే, జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభకానుంది. ఈ లోపే బీసీసీఐ ఐపీఎల్‌ను ముగించాల్సి ఉంటుంది. మరోవైపు, లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో మిగతా మ్యాచ్‌లు నిర్వహించడం బీసీసీఐకి సవాలే. పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రతా సమస్యలు తలెత్తనున్నాయి. అందువల్ల, ఎలక్షన్‌ జరిగే తేదీతోపాటు ఆ ముందు రోజుగానీ, ఆ తర్వాతి రోజుగానీ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ ఆధారంగా బీసీసీఐ మిగతా మ్యాచ్‌లకు వేదికలను, తేదీలను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, వచ్చే నెల 19 నుంచి ఎన్నికలు ప్రారంభంకావడంతో ఆ లోపే కొన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తున్నది. ఈ సీజన్‌లో ఎక్కువగా డబుల్ హెడర్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది.

2019 తరహాలో..

2019 ఐపీఎల్ సీజన్‌ సమయంలోనూ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సీజన్‌ను లీగ్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించారు. ఆ సీజన్‌లో మార్చి 23 నుంచి మే 12 వరకు మ్యాచ్‌లు నిర్వహించారు. అదే సమయంలో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరిగాయి. ఆ సీజన్ మాదిరే ఈ సారి ఐపీఎల్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో దశ మ్యాచ్‌లను యూఏఈకి తరలించనున్నట్టు వస్తున్న వార్తలపై బీసీసీఐ సెక్రెటరీ జై షా స్పందించారు. లీగ్ మొత్తం భారత్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News