భారత ప్రభుత్వం అనుమతిస్తేనే.. పాక్‌కు భారత జట్టు : రాజీవ్ శుక్లా
భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
దిశ, స్పోర్ట్స్ : భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగబోయే చాంపియన్ ట్రోఫీకి పాక్ వేదిక. దీంతో భారత జట్టు దాయాదీ దేశంలో పర్యటించడంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా మీడియాతో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ..‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తాం. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మేము మా జట్టును పంపిస్తాం.’ అని చెప్పారు.
కాగా, గతేడాది ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్య దేశంగా ఉండగా.. భారత జట్టును పంపించడానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఆ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. చాంపియన్స్ ట్రోఫీ కూడా అదే తరహాలో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. మరి, దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. భారత్, పాకిస్తాన్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లోనే తలపడుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు.