చెలరేగిన శ్రీలంక టాప్ బ్యాటర్లు.. తొలి రోజే భారీ స్కోరు

ఆతిథ్య బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు గెలిచిన శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.

Update: 2024-03-30 12:23 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు గెలిచిన శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. చటోగ్రామ్ వేదికగా శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆ జట్టుదే ఆధిపత్యం. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. ముందుగా ఓపెనర్లు నిశాన్ మదుశంక, కరుణరత్నే జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ తర్వాత కాసేపటికే మధుశంక(57) రనౌట్‌గా వెనుదిరగగా.. ఆ తర్వాత కరుణరత్నేకు కుసాల్ మెండిస్ తోడయ్యాడుక్రీజులో పాతుకపోయిన ఈ జోడీ బంగ్లా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారింది. రెండో వికెట్‌కు ఈ జంట 114 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.

సెంచరీ దిశగా వెళ్తున్న కరుణరత్నే(86) అవుటవడంతో ఈ జోడీకి తెరపడింది. కాసేపటికే కుసాల్ మెండిస్(93) కూడా శతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఏంజెల్ మాథ్యూస్(23) స్వల్ప స్కోరుకు వెనుదిరగగా.. దినేశ్ చండిమాల్(34 నాటౌట్), ధనంజయ డి సిల్వ(15 నాటౌట్) ఆచితూచి ఆడుతూ మొదటి రోజును ముగించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ 2 వికెట్లు, షకీబ్ అల్ హసన్ ఒక్క వికెట్ పడగొట్టారు. శ్రీలంక భారీ స్కోరు దిశగా వెళ్తుండటంతో.. రెండో రోజు బంగ్లా బౌలర్లు పుంజుకోకపోతే ఆ జట్టు కష్టాల్లో పడే అవకాశాలు ఉన్నాయి. 

Tags:    

Similar News