బోపన్న టైటిల్ సాధించేనా?.. నేడే ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్‌

Update: 2024-01-26 18:32 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న కొంతకాలంగా అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఆస్ట్రేలియన్ పార్ట్‌నర్ మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బోపన్న తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. నేడు పురుషుల డబుల్స్ ఫైనల్ జరగనుంది. ఈ టైటిల్ పోరులో ఇటలీకి చెందిన సిమోనె బొలెల్లి-ఆండ్రే వవాస్సోరి జోడీతో బోపన్న ద్వయం తలపడనుంది. బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు ఓ గ్రాండ్‌స్లామ్‌లో పురుషుల డబుల్స్ చాంపియన్‌గా నిలువలేదు. 2017లో గాబ్రియెలా దబ్రోవ్‌స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న అతను.. పురుషుల టైటిల్ మాత్రం అందుకోలేకపోయాడు. 2010తోపాటు గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ రన్నరప్‌గా సరిపెట్టాడు. ఆ కల నెరవేర్చుకునేందుకు బోపన్నకు ఇది చక్కటి అవకాశం. మరి, బోపన్న తొలి గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్ టైటిల్‌ నిరీక్షణకు తెరదించుతాడో లేదో నేడు తేలనుంది.


Tags:    

Similar News