రెండో టెస్టులో ఆసిస్‌పై విండీస్ చారిత్రాత్మక విజయం.. టెస్టు సిరీస్ 1-1తో డ్రా
రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది.
దిశ, స్పోర్ట్స్ : రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో విండీస్ చారిత్రాత్మక విజయం అందుకుంది. రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో ఆదివారం8 పరుగుల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసిస్ 207 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై వెస్టిండీస్ టెస్టు విజయం అందుకుంది. అంతేకాకుండా, రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. అనంతరం ఆసిస్ 289/9 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే పరిమితమైన విండీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 22 పరుగులు కలుపుకుని.. ఆసిస్ ముందు 216 పరుగుల టార్టెట్ పెట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 60/2తో ఆదివారం ఆట కొనసాగించిన ఆసిస్ 207 పరుగులకే పరిమితమైంది. పేసర్ షామర్ జోసెఫ్(7/68) ఆసిస్ పతనాన్ని శాసించాడు. అతని పేస్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఓపెనర్ స్టీవ్ స్మిత్(91 నాటౌట్) చివరి వరకూ ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు.
కాగా, 1997లో పెర్త్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసిస్‌పై విండీస్ తొలిసారిగా విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత కంగారుల గడ్డపై కరేబియన్ జట్టు గెలుపు రుచిచూసింది. 1997 మ్యాచ్‌లో ఆడిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించాడు. విండీస్ విజయంతో అతను ఎమోషనల్ అయ్యాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కన ఉన్న మరో కామెంటేటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను హగ్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1997 మ్యాచ్‌లో విండీస్ గెలవడంలో బ్రియాన్ లారా కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను 132 పరుగులు చేశాడు