ICC Test Rankings : టాప్-3లో ఒకే దేశానికి చెందిన‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్..

WTC Final తర్వాత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకుంది.

Update: 2023-06-14 12:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final తర్వాత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకుంది. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మొదటి మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. మార్నస్ లాబుస్చెన్ మొదటి స్థానంలో, స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో, ట్రావిస్ హెడ్ మూడో స్థానంలో నిలిచారు. 1984 తర్వాత ఒకే దేశానికి చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్-3లో ఉన్నారు. 1984లో వెస్టిండీస్‌కు చెందిన గోర్డాన్ గ్రీనిడ్జ్ మొదటి స్థానంలో, క్లైవ్ లాయిడ్ రెండో స్థానంలో, లారీ గోమెజ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో భారత్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే ర్యాంకింగ్‌ను మెరుగుప‌రుచుకున్నాడు.

ఫైనల్ రెండు ఇన్నింగ్సుల‌లో 89, 46 పరుగులు చేసిన రహానే 37వ స్థానానికి ఎగబాకాడు. రిషబ్ పంత్ టాప్-10లో ఉన్న ఏకైక భారతీయ బ్యాట్స్‌మెన్. పంత్ 10వ స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానంలో, విరాట్ కోహ్లీ 13వ స్థానంలో ఉన్నారు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ ఫైనల్ ఆడకపోయినా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. గాయపడిన బుమ్రా రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.


Similar News