విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్న వార్నర్.. తొలి టీ20 ఆసిస్‌దే

టెస్టులకు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలి టీ20 మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వెస్టిండీస్‌పై మెరుపులు మెరిపించాడు.

Update: 2024-02-09 12:20 GMT

దిశ, స్పోర్ట్స్ : టెస్టులకు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలి టీ20 మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వెస్టిండీస్‌పై మెరుపులు మెరిపించాడు. వార్నర్‌తోపాటు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విండీస్‌ను నిలువరించడంతో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. హోబర్ట్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో కరేబియన్ జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆసిస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 213 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ వార్నర్.. 36 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 70 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిష్‌(39)తో కలిసి తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించాడు. టిమ్ డేవిడ్(37 నాటౌట్), వేడ్(21) విలువైన పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు, అల్జారీ జోసెప్ 2 వికెట్లతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో 202/8 స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(53), జాన్సెన్ చార్లెస్(42) రాణించగా.. ఆఖర్లో జేసన్ హోల్డర్(34 నాటౌట్) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆసిస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు, స్టోయినిస్ 2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆదివారం రెండో టీ20 జరగనుంది.

మరోవైపు, వెస్టిండీస్‌తో తొలి టీ20తో వార్నర్ తన కెరీర్‌లో 100వ టీ20 మ్యాచ్ ఆడాడు. దీంతో అతను అరుదైన రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఈ రికార్డు సాధించిన మూడో క్రికెటర్‌గా అతను నిలిచాడు. వార్నర్ కంటే ముందు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్ ఈ ఘనత అందుకున్నారు. అలాగే, ఆసిస్ మాజీ కెప్టెన్, ఆరోన్ ఫించ్(103), ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(100) తర్వాత టీ20ల్లో 100 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా కూడా వార్నర్ గుర్తింపు పొందాడు. 

Tags:    

Similar News