AUS vs IND 3rd Test: మూడో టెస్టులో భారత్ ఆలౌట్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫి టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ గబ్బా వేదికగా జరుగుతోంది.
దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫి టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ గబ్బా వేదికగా జరుగుతోంది. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మొదటి రోజు వర్షం కారణంగా 13 ఓవర్లు మాత్రమే పడగా.. రెండో రోజు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. అలాగే మూడో రోజు వర్షం పడుతూ.. ఆగడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు మంచి అవకాశం దక్కింది. కాగా మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 117.1 ఓవర్లు ఆడి 445 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారత్ బ్యాటింగ్ ప్రారంభించగా.. వర్షం తీవ్ర అడ్డంకిగా మారింది. దీనికి తోడు భారత బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అయ్యారు.
దీంతో భారత్ ఒకానొక స్టేజీలో ఫాలో- ఆన్ ప్రమాదంలోకి వెళ్లగా.. నాలుగో రోజు చివరి ఓవర్లో ఆకాష్ దీప్ ఫోర్ కొట్టడంతో ఆ ప్రమాదం నుంచి భారత్ గట్టెక్కింది. కాగా ఐదో రోజు మొదటి సెషన్ లోనే భారత్ 260 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇందులో రాహుల్ 84, జడేజా 77, ఆకాష్ దీప్ 31, నితీష్ రెడ్డి 16 పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్ 185 పరుగుల వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4, కమ్మిన్స్ 4, హెంజిల్ వుడ్, లయన్, హెడ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచులో మరో రెండు సెషన్ లు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉండటంతో ఈ మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.