Asian Table Tennis Championship: భారత్‌కు పతకం ఖాయం.. సెమీస్‌కు చేరుకున్న పురుషుల జట్టు

ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు అదరగొట్టింది.

Update: 2023-09-04 14:51 GMT

ప్యాంగ్‌చాంగ్ : ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు అదరగొట్టింది. సౌత్ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో శరత్ కమల్, జ్ఞానేశ్వరన్ సత్యన్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు సెమీస్‌కు అర్హత సాధించి పతకం ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో సింగపూర్‌ను చిత్తు చేసింది. సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ ఈ మ్యాచ్‌కు భారత్‌కు శుభారంభం అందించాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో ఐజాక్ క్యూక్‌పై 2-3(1-11, 12-10, 8-11, 13-11, 12-14) తేడాతో శరత్ పోరాడి గెలిచాడు. శరత్ శుభారంభాన్ని రెండో గేమ్‌లో జ్ఞానేశ్వర్ సత్యన్ కొనసాగించాడు. పాంగ్ యూ ఎన్ కోయెన్‌ను 0-3(6-11, 8-11, 10-12) తేడాతో చిత్తు చేసి భారత్‌ను 2-0తో ఆధిక్యంలో నిలబెట్టాడు. హర్మీత్ దేశాయ్ సైతం అదే జోరును కనబర్చాడు.

మూడో గేమ్‌‌ను హర్మీత్ 3-0(11-9, 11-4, 11-6) తేడాతో క్లారెన్స్ చెవ్ జె యుపై ఏకపక్షంగా గెలుచుకున్నాడు. దాంతో వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకున్న భారత్.. మరో రెండు గేమ్‌లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ సెమీస్‌లో అడుగుపెట్టడంతో కనీసం కాంస్య పతకం ఖరారైంది. బుధవారం సెమీస్‌లో భారత్.. చైనీస్ తైఫీ జట్టుతో తలపడనుంది. మరోవైపు, భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో పరాజయం పాలైంది. మనికా బాత్రా, ఐహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీల త్రయం 0-3 తేడాతో జపాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. నేడు జరగబోయే మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ-హర్మన్ దేశాయ్‌ జోడీ.. మలేషియా ద్వయంతో తలపడనుంది.


Similar News