ఆసియా రిలే చాంపియన్‌షిప్‌‌లో జ్యోతిక జట్టుకు స్వర్ణం

Update: 2024-05-20 16:23 GMT

దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్‌లో జరుగుతున్న తొలి ఆసియా రిలే చాంపియన్‌షిప్ టోర్నీలో తెలుగమ్మాయి జ్యోతిక శ్రీ దండి సత్తాచాటింది. భారత 4x400 మీటర్ల మిక్స్‌డ్ జట్టు స్వర్ణ పతకం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. సోమవారం నిర్వహించిన ఈవెంట్‌లో జ్యోతిక, ముహమ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సుభా వెంకటేశన్‌లతో కూడిన భారత 4x400 మీటర్ల మిక్స్‌డ్ జట్టు విజేతగా నిలిచింది. 3:14.12 సెకన్లలో రేసు ముగించి గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాకుండా, ఈ ప్రదర్శనతో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది.గతేడాది ఆసియా క్రీడల్లో అజ్మల్, విత్యా రాంరాజ్, రాజేశ్ రమేశ్, సుభా జట్టు 3:14.34 సెకన్ల ప్రదర్శనను ప్రస్తుత టీమ్ అధిగమించింది. శ్రీలంక(3:17.00), వియత్నం(3:18.45) జట్లు రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.

మరోవైపు, 4x400 మీటర్ల మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు ఒలింపిక్స్ కోటా ఇంకా ఖరారు కాలేదు. ఈ నెలలో బహామాస్‌లో జరిగిన వరల్డ్ రిలేస్ 24లో నేరుగా బెర్త్ సాధించడంలో విఫలమైంది. దీంతో భారత్ రోడ్ టూ పారిస్ ర్యాంకింగ్స్‌పైనే ఆధారపడింది. తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 21వ ర్యాంక్‌కు చేరుకోనుంది. అయితే, టాప్-16 జట్లు మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. జూన్ 30తో ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ విండో ముగియనుంది. మరోవైపు, జ్యోతిక భాగమైన 4x400 మీటర్ల మహిళల జట్టు ఒలింపిక్ బెర్త్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News