Asian Games 2023: ఆసియా క్రీడల్లో పతకానికి చేరువైన భారత్.. ఫైనల్ చేరిన బాల్‌రాజ్ పన్వర్

Update: 2023-09-23 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌‌ తొలి పతకానికి చేరువైంది. హరియాణాకు చెందిన భారత రోవర్‌ బాల్‌రాజ్‌ పన్వర్‌ పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. పురుషుల రోయింగ్‌‌లో బాల్‌రాజ్‌ పన్వర్‌ ఫైనల్‌లో అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సింగిల్‌ స్కల్‌ రోయింగ్‌ సెమీఫైనల్లో 24 ఏళ్ల బాల్‌రాజ్‌ సత్తా చాటాడు. మొత్తం 7 నిమిషాల 22.22 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో ఫైనల్ చేరాడు.

ఇక రోయింగ్‌లో మిగతా విభాగాల విషయానికొస్తే.. భారత పురుషుల క్వాడ్రపుల్‌ స్కల్స్‌ టీమ్‌, లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్క్‌, పురుషుల డబుల్స్‌ స్కల్స్‌, పురుషుల కాక్స్‌డ్‌ 8, కాక్స్‌లెస్‌ పెయిర్‌, కాక్స్‌లెస్‌ 4, మహిళల కాక్స్‌లెస్‌ 4, కాక్స్‌డ్‌ 8 జట్లు కూడా ఆసియా క్రీడల్లో ఫైనల్‌ చేరుకున్నాయి. సెయిలింగ్‌ మిక్స్‌డ్‌ డింగీ 470 రేస్‌లో తెలుగమ్మాయి ప్రీతి కొంగర - సుధాన్షు శేఖర్‌ జోడీ ఆరో స్థానంలో నిలిచింది. ఇక వాలీబాల్‌లో పురుషుల జట్టు అదరగొట్టింది. చైనీస్ తైపీ జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు ఏకంగా 3-0తో చైనీస్‌ టీంను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత జట్టు క్వార్టర్స్‌‌లో అడుగు పెట్టింది. అలాగే టేబుల్‌ టెన్నిస్‌లో కూడా భారత పురుషుల జట్టు ముందడుగు వేసింది. తొలి మ్యాచ్‌లో 3-0తో యెమన్‌ను చిత్తుగా ఓడించింది.


Similar News