Asian Games 2023: పాకిస్తాన్‌పై అఫ్ఘనిస్తాన్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో 'ఢీ'
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడలు-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా శుక్ర వారం పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి ఎదురైంది. అఫ్గన్ టీమ్ ఈ విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా పటిష్ట టీమిండియాతో ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పోటీపడే సువర్ణావకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అఫ్ఘన్ బౌలర్ల ధాటికి కేవలం 115 రన్స్‌కు పాక్ ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్స్‌లో.. ఒమైర్ యూసఫ్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ గులాబదిన్, కరీం జనత్ ఒక్కో వికెట్ తీయగా.. ఫరీద్ అహ్మద్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా.. కైస్ అహ్మద్, జహీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సెదీకుల్హా అటల్ 5, మహ్మద్ షాజాద్ 9 పరుగులకే అవుటయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ 39 పరుగులతో రాణించగా.. ఏడోస్థానంలో వచ్చిన గులాబిదిన్ 19 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాది అఫ్గనిస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. రుతురాజ్ గైక్వాడ్ సేనతో శనివారం(అక్టోబరు 7) అమీతుమీ తేల్చుకోనుంది. కాగా మొదటి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా గోల్డ్ మెడల్ రేసుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సెమీస్ ఫైనల్స్‌లో ఓడిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య శనివారం ఉదయం 6.30 గంటలకు కాంస్య పతక పోరు మొదలుకానుంది.