ICC T20I rankings : 4వ స్థానానికి దూసుకొచ్చిన స్మృతి మంధాన

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు.

Update: 2024-07-30 12:17 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. ఆసియా కప్‌లో ప్రదర్శన ఆధారంగా వారి స్థానాలు మెరుగయ్యాయి. ఐసీసీ మంగళవారం మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బ్యాటింగ్ విభాగంలో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించింది. 743 రేటింగ్ పాయింట్లతో ఒక్క స్థానాన్ని ఎగబాకి 4వ ర్యాంక్‌కు చేరుకుంది. షెఫాలీ వర్మ 11వ స్థానంలో ఉండగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 5 స్థానాలు కోల్పోయి 16వ ర్యాంక్‌కు పడిపోయింది. రోడ్రిగ్స్ 18వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రేణుక సింగ్, రాధా యాదవ్ మెరుగైన స్థానాలను పొందారు. రేణుక 4 స్థానాలను వెనక్కినెట్టి టాప్-5లోకి చేరగా.. రాధా ఏకంగా 7 స్థానాలు అధిగమించి 13వ ర్యాంక్‌లో నిలిచింది. దీప్తి శర్మ బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో మూడో స్థానాన్ని కాపాడుకుంది. కాగా, ఆసియా కప్‌లో జైత్రయాత్ర కొనసాగించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ బోల్తా పడిన విషయం తెలిసింది. టైటిల్ పోరులో శ్రీలంక చేతిలో ఓడి టైటిల్ కాపాడుకోలేకపోయింది.

Tags:    

Similar News