IND VS PAK: కోహ్లి రికార్డును సమం చేసిన కేఎల్‌ రాహుల్‌..

ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి రికార్డును సమం చేశాడు.

Update: 2023-09-10 13:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద వన్డేల్లో 2,000 పరుగుల మైలురాయిని తాకాడు. రాహుల్‌ తన 53వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా వన్డేల్లో ఫాస్టెస్ట్‌ 2,000 రన్స్‌ రికార్డు హషీమ్‌ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన రికార్డు శిఖర్‌ ధవన్‌ పేరిట ఉంది. ధవన్‌ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ధవన్‌ తర్వాత సిద్దూ (52), గంగూలీ (52) ఈ ఫీట్‌ను సాధించారు. రాహుల్‌కు ముందు కోహ్లి కూడా తన 53వ ఇన్నింగ్స్‌లోనే 2000 పరుగుల మార్కును తాకాడు.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే పాక్‌ అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (56), శుభ్‌మన్‌ గిల్‌ (58) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. అర్ధశతకాలు పూర్తి చేసుకున్న తర్వాత వీరిరువురు ఔటయ్యారు. 24.1 ఓవర్ల తర్వాత వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. ఈ సమయానికి టీమిండియా స్కోర్‌ 147/2గా ఉంది. విరాట్‌ కోహ్లి (8), కేఎల్‌ రాహుల్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌, షాహీన్‌ అఫ్రిది తలో వికెట్‌ పడగొట్టారు.


Similar News