Asia Cup 2023: ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక!

ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతున్నది. మరో 12 రోజుల్లో టోర్నీ షురూ కానుంది.

Update: 2023-08-17 16:38 GMT

న్యూఢిల్లీ : ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతున్నది. మరో 12 రోజుల్లో టోర్నీ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్ జట్టు ఎంపికపై కసరత్తు చేసింది. ఈ క్రమంలో ఈ నెల 20న భారత జట్టును ఎంపిక చేయనున్నట్టు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. విండీస్ పర్యటన తర్వాత ఎవరిని ఎంపిక చేయాలనేది సెలెక్టర్లకు ఓ క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో టోర్నీ ప్రణాళికల్లో ఉన్న పలువురిపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు పక్కనపెట్టే చాన్స్ ఉంది.

విండీస్ పర్యటనలో అవకాశాలు ఇచ్చినా అతను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఆసియా కప్‌కు అందుబాటులో ఉంటాడని భావించిన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. మరోవైపు, ఐర్లాండ్‌ పర్యటనతో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన బుమ్రా ఆసియా కప్‌లో ఆడటం ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో కోలుకుంటున్న మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ టోర్నీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 30న జరిగే పాకిస్తాన్, నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్ మొదలుకానుంది. టీమ్ ఇండియా సెప్టెంబర్ 2న జరిగే మ్యాచ్‌లో పాక్‌తో తలపడటంతో టోర్నీని ఆరంభించనుంది.


Similar News