Asia Cup 2023: జట్టు ఎంపికపై వివాదాలు సృష్టించొద్దు.. Sunil Gavaskar

ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Update: 2023-08-22 16:18 GMT

న్యూఢిల్లీ : ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. జట్టు ఎంపిక అయిపోయిందని, వివాదాలు సృష్టించే బదులు జట్టుకు మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ‘కొందరు అదృష్టవంతులే కావచ్చు. కానీ, జట్టు ఎంపిక పూర్తయింది. కాబట్టి, అశ్విన్ గురించి మాట్లాడొద్దు. వివాదాలు సృష్టించొద్దు. ఇది మన జట్టు. మీకు ఎంపిక నచ్చపోతే మ్యాచ్ చూడొద్దు. అంతేగానీ, అతన్ని తీసుకోవాల్సింది లేదా అతనికి బదులు మరొకరిని తీసుకోవాలి వంటి చర్చ వద్దు. అది తప్పుడు ఆలోచన’ అని గవాస్కర్ ఘాటుగా స్పందించాడు.

ఆసియా కప్ కోసం జట్టు ఎంపిక బాగుందని, అనుభవజ్ఞులు, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేశారని చెప్పాడు. కేఎల్ రాహుల్ ఎంపికపై గవాస్కర్ స్పందిస్తూ.. ‘అతని గాయం ఎలా ఉందో చూద్దాం. ఆసియా కప్ గెలవడం ముఖ్యమే. కానీ, వరల్డ్ కప్ గెలవడం లక్ష్యం. ప్రపంచకప్‌లో రాహుల్ ఆడాలని వారు కోరుకుని ఆసియా కప్‌కు ఎంపిక చేస్తే ఆ నిర్ణయం సరైందే.’ అని తెలిపాడు.


Similar News