Asia Cup 2023: జట్టు ఎంపికలో అయోమయం.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై మాజీ క్రికెటర్ క్రిష్టమాచారి శ్రీకాంత్ కాస్త అంసతృప్తి వ్యక్తం చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై మాజీ క్రికెటర్ క్రిష్టమాచారి శ్రీకాంత్ కాస్త అంసతృప్తి వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయి ఫిట్‌గా లేని కేఎల్ రాహుల్‌ను తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అయోమయానికి గురైనట్లు పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టు సరిగ్గా లేదనిపిస్తోంది. జట్టులో ఎందుకు అంతమంది మీడియం పేసర్లు? ఎవరు ఫిట్‌గా ఉన్నారనేది సెలెక్టర్లకు తెలిసినట్లు లేదు. కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని.. అతడిని ఎంపిక చేయకుండా ఉంటే బాగుండేది. సెలెక్షన్ సమయానికి ఆటగాడు ఫిట్‌గాలేకపోతే ఎంపిక చేయకుండా ఉండాలనేదే నా పాలసీ.
అతడు వరల్డ్ కప్‌లోనూ అందుబాటులో ఉండాలనుకుంటున్నారా? అలాంటప్పుడు ఆసియా కప్‌లో రెండు గేమ్‌లు తర్వాత ఆడతాడని ఆశిస్తున్నారా? ఇదే విషయంలో అగార్కర్ కమిటీ అయోమయానికి గురైంది. ఇక యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఐర్లాండ్‌పై నాలుగు ఓవర్ల స్పెల్ ఆధారంగా అతడిని ఎంపిక చేశారు. దాదాపు సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతడి ఎంపికా సరైందేనని మీరు భావిస్తున్నారా?’’ అని క్రిష్టమాచారి శ్రీకాంత్ ప్రశ్నించాడు.