Asia Cup 2023: ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ సంతృప్తికరంగా లేదు.. Zaka Ashraf

ఆసియా కప్‌కు నిర్ణయించిన హైబ్రిడ్ మోడల్ సంతృప్తికరంగా లేదని జకా అష్రఫ్ అన్నారు.

Update: 2023-06-22 13:03 GMT

కరాచీ: ఆసియా కప్‌కు నిర్ణయించిన హైబ్రిడ్ మోడల్ సంతృప్తికరంగా లేదని జకా అష్రఫ్ అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా నజామ్ సేథీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో జకా అష్రఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శ్రీలంకలో 9 మ్యాచ్‌లు, పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించే ఈ టోర్నీ పాక్‌కు నష్టదాయకమని అష్రఫ్ అభిప్రాయపడ్డారు. అయినా.. ఈ షెడ్యూల్ ఇప్పటికే నిర్ణయించినందున దాన్ని తాను అడ్డుకునేందుకు ప్రయత్నించబోనని చెప్పారు. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో నిర్వహించే ఆసియా కప్ పాకిస్తాన్‌లో నిర్వహిస్తే భద్రతా కారణాల రీత్యా పాల్గొనేందుకు భారత్ నిరాకరించినందున హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ముందుకు తెచ్చింది.

50 ఓవర్ల ఈ టోర్నీకి ఆతిథ్య హక్కులు పీసీబీకే ఉన్నందున పాక్‌లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుండేదని అష్రఫ్ చెప్పారు. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రయోజనం కలిగించే రీతిలోనే ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ కోసం భారత్‌కు పాక్ జట్టును పంపించే విషయంపై పీసీబీ నిర్ణయం తీసుకునే దశలో లేదని అష్రఫ్ స్పష్టం చేశారు. దీనిపై పాక్ ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.


Similar News