Ashes 2023: ఆసీస్ బిగ్ షాక్.. స్టార్‌ స్పిన్నర్‌‌కు గాయం

లార్డ్స్‌ టెస్టు‌లో ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తీవ్రంగా గాయపడ్డాడు.

Update: 2023-06-30 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: లార్డ్స్‌ టెస్టు‌లో ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటలో లియోన్‌ ఫీల్డింగ్‌ చేస్తూ బౌండరీ లైన్‌ వద్ద గాయపడ్డాడు. రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌లో ఇది జరిగింది. ఈ క్రమంలో నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాతి సెషన్‌కు లియోన్‌ మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు. రెండో టెస్టులో లియోన్‌ 13 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే 500 వికెట్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. ఇక లియోన్‌కు లార్డ్స్‌ టెస్టు వందోది అన్న సంగతి తెలిసిందే.

ఒకవేళ నాథన్ గాయంతో యాషెస్ సిరీస్‌కు దూరమైతే అతని స్థానంలో టాడ్ మార్ఫీని మూడో టెస్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. లియోన్ 30 యాషెస్ టెస్టుల్లో 29.41 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటివరకు 122 టెస్టుల్లో 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 61 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ 45, బెన్‌ స్టోక్స్‌ 17 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్‌ ప్రస్తుతం 138 పరుగులు వెనుకబడి ఉంది.


Similar News