Ashes 2023: ఇంగ్లండ్ కొంప ముంచింది అతనే.. ఫ్యాన్స్ ఫైర్

Ashes 2023లో భాగంగా ఆసీస్‌‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చివరి వరకు పోరాడినా ఓటమిని తప్పించుకోలేకపోయింది.

Update: 2023-06-21 10:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023లో భాగంగా ఆసీస్‌‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చివరి వరకు పోరాడినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ నిర్ణయం పక్కన పెడితే.. మరో కారణం చూపించి కూడా స్టోక్స్‌పై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఇంగ్లండ్ ఓటమికి కారణం అతనే అంటున్నారు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను ఇంగ్లండ్ ఓడించినంత పని చేసింది. క్రీజులో నిలదొక్కుకున్న ఖవాజా (65) ఎట్టకేలకు అవుటయ్యాడు. ఆ వెంటనే కీపర్ అలెక్స్ క్యారీ (20)ని జో రూట్ అద్భుతంగా ఔట్ చేశాడు. తన బౌలింగ్‌లో వచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకొని క్యారీని పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లండ్ గెలిచేస్తుందని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు.

ఆసీస్ అప్పటికే 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కమిన్స్, నాథన్ లియాన్ ఉండగా.. వీళ్లిద్దరిలో కమిన్స్‌ బ్యాటింగ్‌పైనే ఆసీస్ విజయం ఆధారపడి ఉంది. అయితే అతన్ని ఔట్ చేయడం కష్టం. ఇలాంటి సమయంలో ఎవరైనా సరే లియాన్‌ను టార్గెట్ చేయడం సహజమే. ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ పేసర్లు అదే చేశారు. షార్ట్ బాల్స్‌తో లియాన్‌కు ముచ్చెమటలు పట్టించారు. దీంతో నాథన్ లియాన్ 84 ఓవర్లో ఒక నిర్లక్ష్యపు షాట్ ఆడగా.. గాల్లోకి లేచిన బంతి స్క్వేర్ లెగ్‌లో ఉన్న బెన్ స్టోక్స్ వైపు వెళ్లింది. అయితే అది కొంచెం ఎత్తులో వెళ్లడంతో స్టోక్స్ గాల్లోకి జంప్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకోబోయాడు. కానీ ల్యాండింగ్‌లో బంతి అతని చేతి నుంచి జారిపోయింది. ఈ క్యాచ్ నేలపాలు కావడంతో మ్యాచ్ కూడా ఇంగ్లండ్ చేజారిందని చాలా మంది ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేశారు.

వాళ్లు చెప్పినట్లే ఆ తర్వాత లియాన్ మరో అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ కమిన్స్ (44 నాటౌట్)తో కలిసి చివరి వరకు పోరాడాడు. అతను 16 పరుగులతో అజేయంగా నిలవడంతో కమిన్స్ జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ స్టోక్స్‌పై మండిపడుతున్నారు. చేతికి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసి, మ్యాచ్ ఓడించావని స్టోక్స్‌పై ఫైరవుతున్నారు.


Similar News