ఫ్రెంచ్ ఓపెన్‌లో సబలెంక శుభారంభం

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ చాంపియన్ అరీనా సబలెంక(బెలారస్) పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో శుభారంభం చేసింది.

Update: 2024-05-28 18:23 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ చాంపియన్ అరీనా సబలెంక(బెలారస్) పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సబలెంక 6-1, 6-2 తేడాతో అన్‌సీడ్ క్రీడాకారిణి ఎరికా ఆండ్రీవాపై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సబలెంక ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసింది. కేవలం గంటా 8 నిమిషాల్లోనే రెండు సెట్లను నెగ్గింది. ప్రత్యర్థి కనీసం పోటీ ఇవ్వకపోవడంతో తొలి రౌండ్‌లో విజయం కోసం సబలెంక పెద్దగా కష్టపడలేదు.

వరల్డ్ నం.4 రిబాకినా(కజకిస్తాన్) సైతం రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో గ్రీట్ మిన్నెన్(బెల్జియం)పై 6-2, 6-3 తేడాతో గెలుపొందింది. అలాగే, 7వ సీడ్ జెంగ్ క్విన్వెన్(చైనా), 10వ సీడ్ డారియా కసత్కినా, 14వ సీడ్ మాడిసన్ కీస్(అమెరికా) సైతం తొలి రౌండ్‌లో విజయాలు నమోదు చేశారు. 13వ సీడ్, గత సెమీ ఫైనలిస్ట్ హద్దాద్ మైయా(బ్రెజిల్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అన్‌సీడ్ క్రీడాకారిణి కోకియారెట్టో(ఇటలీ) 3-6, 6-4, 6-1 తేడాతో ఆమెకు షాకిచ్చింది. మరోవైపు, మెన్స్ సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మెద్వెదెవ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో అతను 6-3, 6-4, 5-7, 6-3 తేడాతో కోఫెర్(జర్మనీ)ని ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్(అమెరికా), 13వ సీడ్ రూనె(డెన్మార్క్) కూడా ముందడుగు వేశారు. 


Similar News