యూఎస్ ఓపెన్‌కు కొత్త క్వీన్.. టైటిల్ ఎగరేసుకపోయిన సబలెంక

యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌కు కొత్త క్వీన్ వచ్చింది. వరల్డ్ నం.2 సబలెంక ఉమెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది.

Update: 2024-09-08 14:31 GMT

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌కు కొత్త క్వీన్ వచ్చింది. వరల్డ్ నం.2 సబలెంక ఉమెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలవడం ఆమెకు ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన సబలెంకు ఇది రెండో టైటిల్. మొత్తంగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. మరోవైపు, సంచలన ప్రదర్శనతో తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగులాకు టైటిల్ పోరులో నిరాశే ఎదురైంది.

బెలారస్ స్టార్ క్రీడాకారిణి సబలెంక యూఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను ఎగురేసుకపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె 7-5, 7-5 తేడాతో పెగులాను ఓడించింది. రెండు సెట్లలోనే ఆటను ముగించినప్పటికీ సబలెంకకు పెగులా నుంచి గట్టి పోటీ ఎదురైంది. దాదాపు రెండు గంటలపాటు వీరిద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. తొలి సెట్‌లో మొదట నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంక 5-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఆమెకు పెగులా సెట్‌ను అంత సులభంగా అప్పగించలేదు. వరుసగా 8, 9, 10 గేమ్‌ల్లో పైచేయి సాధించి స్కోరును 5-5తో సమం చేసి టెన్షన్ పెట్టింది. కానీ, సబలెంక 11, 12 గేమ్‌లను దక్కించుకోవడంతో తొలి సెట్ ఆమె సొంతమైంది. రెండో సెట్ ఇంకా ఆసక్తికరంగా సాగింది. తొలుత 0-3తో సబలెంక ఆధిక్య కనబర్చగా.. పెగులా బలంగా పుంజుకుంది. వరుస గేమ్‌ల్లో నెగ్గి 5-3తో లీడ్‌లోకి వెళ్లి రెండో సెట్‌ను దక్కించుకునేలా కనిపించింది. కానీ, సబలెంక ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. వరుసగా, 9, 10, 11, 12 గేములను దక్కించుకోవడంతో మ్యాచ్‌తోపాటు టైటిల్‌ సబలెంక సొంతమైంది. 

Tags:    

Similar News