ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. లీగ్ ప్రారంభ తేదీని వెల్లడించిన చైర్మన్ అరుణ్ ధుమాల్

ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్-17 సీజన్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది.

Update: 2024-02-20 12:24 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్-17 సీజన్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. టోర్నీ ప్రారంభ తేదీపై చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశారు. మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభంకానున్నట్టు వెల్లడించారు. టోర్నీ సమయంలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో లీగ్ నిర్వహణపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ చైర్మన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పారు.

తాజాగా జాతీయ మీడియాతో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. మార్చి 22 నుంచి టోర్నీని ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సంస్థలతో మేము పనిచేస్తున్నామని, త్వరలోనే మేము ప్రారంభ షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని తెలిపారు. అలాగే, టోర్నీ ఎక్కడికీ తరలించడం లేదని, భారత్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా లీగ్ షెడ్యూల్‌ను రూపొందించాలని బీసీసీఐ భావిస్తున్నది. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఈ సారి టోర్నీని రెండు దశల్లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. మొదట 15 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల తేదీలు ప్రకటన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్-17 వేదికలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. గత సీజన్‌లో 12 వేదికలపై మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాతే వేదికలపై కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. ఏకకాలంలో లోక్‌సభతోపాటు అసెంబ్లీకి ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, ఎన్నికల తేదీలను బట్టి వేదికలను ఖరారు చేయనున్నారు. అయితే, ఓపెనింగ్ మ్యాచ్‌కు చెన్నయ్‌లోని ఎం.ఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్టు తెలుస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నట్టు సమాచారం. గత సీజన్ ఫైనలిస్టులు ఓపెనింగ్ మ్యాచ్‌లో ఎదురుపడే సంప్రదాయాన్ని ఈ సారి కూడా కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News