Archery World Cup Final: ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్.. ప్రథమేశ్‌కు రజతం

ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత ఆర్చర్ ప్రథమేశ్ జావ్కర్ రజత పతకం సాధించాడు.

Update: 2023-09-10 12:43 GMT

హెర్మోసిల్లో : ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత ఆర్చర్ ప్రథమేశ్ జావ్కర్ రజత పతకం సాధించాడు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత కేటగిరీలో అతను పతకం గెలుచుకున్నాడు. మెక్సి్‌కోలో ఆదివారం ఉదయం డెన్మార్క్‌కు చెందిన మథియాస్ పుల్లెర్టన్‌‌తో జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ప్రథమేశ్ పరాజయం పాలయ్యాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రథమేశ్ 148(10)-148(10*) తేడాతో షూటౌట్‌లో ఓటమిని అంగీకరించాడు.

అయితే, ఫైనల్ మ్యాచ్‌లో ప్రథమేశ్, పుల్లెర్టన్ మధ్య రసవత్తరమైన పోరు నడిచింది. మూడు గేమ్‌లు పూర్తయ్యే సరికి 90-89తో వెనుకబడిన ప్రథమేశ్.. నాలుగో గేమ్‌(30-29)ను నెగ్గి 119-119తో స్కోరును సమం చేశాడు. ఐదో గేమ్‌లో ఇద్దరు చెరో 29 పాయింట్లు సాధించడంతో 148-148తో స్కోరు సమమయ్యాయి. దాంతో షూటౌట్ నిర్వహించగా.. అక్కడ ప్రథమేశ్ 10 పాయింట్లు సాధించినప్పటికీ.. ప్రత్యర్థి ‘X’ కేంద్రం వద్ద బాణం సంధించడంతో నిరాశ తప్పలేదు. దాంతో ప్రథమేశ్ రజతంతో సరిపెట్టాడు.

మెడెలిన్ వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన మరో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ ఫైనల్‌లో నిరాశపరిచాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో మైక్ ష్లోషర్(నెదర్లాండ్స్) చేతిలో 150-149 తేడాతో ఓడిపోయాడు. కాగా, కెరీర్‌లో తొలి వరల్డ్ కప్ ఫైనల్‌‌లోనే ప్రథమేశ్ పతకం గెలవడంతోపాటు ఈ టోర్నీలో భారత్‌కు తొలి మెడల్ అందించాడు. ఉమెన్స్ కాంపౌండ్ ఈవెంట్‌లో భారత మహిళా ఆర్చరీలు నిరాశపరిచారు. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ఆదితి గోపిచంద్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయాడు.


Similar News