ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ అగర్వాలాకు ఒలింపిక్ బెర్త్
ఆసియా క్రీడల మెడలిస్ట్ అనూష్ అగర్వాలా ఈక్వెస్ట్రియన్‌లో పారిస్ ఒలింపిక్ బెర్త్ సాధించాడు.
దిశ, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల మెడలిస్ట్ అనూష్ అగర్వాలా ఈక్వెస్ట్రియన్‌లో పారిస్ ఒలింపిక్ బెర్త్ సాధించాడు. ఈ విషయాన్ని ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఈఎఫ్‌ఐ) సోమవారం వెల్లడించింది. గతేడాది ఆసియా క్రీడల్లో వ్యక్తిగత డ్రెస్సెజ్ కేటగిరీలో అనూష్ అగర్వాలా భారత్‌కు తొలి పతకం(కాంస్యం) అందించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే, ఇంటర్నేషనల్ ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్(ఎఫ్‌ఈఐ) ఈవెంట్లలోనూ అతను సత్తాచాటాడు. ఎఫ్‌ఈఐ నాలుగు ఈవెంట్లలో ప్రదర్శన ఆధారంగా అతను డ్రెస్సెజ్ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను కన్మార్మ్ చేసుకున్నాడు.
అయితే, బెర్త్ దేశానికి సంబంధించినది కాబట్టి, ఫైనల్ ట్రయల్స్ తర్వాతే అనూష్ అగర్వాల్ పాల్గొనడంపై ఈఎఫ్‌ఐ స్పష్టతనివ్వనుంది. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు ఒలింపిక్స్ కోటా దక్కడంపై అనూష్ అగర్వాలా సంతోషం వ్యక్తం చేశాడు. ‘భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ లభించడంపై గర్వపడుతున్నాను. ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది నా చిన్ననాటి కల. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి నేను అర్హత సాధిస్తానని నమ్మకంగా ఉన్నాను.’ అని తెలిపాడు. కాగా, గతంలో ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్ క్రీడలో నలుగురు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2022 టోక్యో ఒలింపిక్స్‌లో ఫౌద్ మీర్జా పాల్గొనగా.. అంతకుముందు దర్యా సింగ్(1980 మాస్కో), ఇంద్రజిత్ లాంబా(1996 అట్లాంటా), ఇంతియాజ్ అనీస్(2000 సిడ్నీ) ప్రాతినిధ్యం వహించారు. పారిస్ వేదికగా జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి.