'అతని కొడుకు కోసం నా కెరీర్‌ నాశనమైనది'.. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్‌పై అంబటి రాయుడు సంచలన ఆరోపణలు

Update: 2023-06-14 09:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్‌పై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శివలాల్ యాదవ్ వల్లే తాను భారత జట్టుకు సుదీర్ఘ కాలం పాటు ఆడలేకపోయానని అంబటి రాయుడు తెలిపారు. తన కొడుకు అర్జున్ యాదవ్ కోసం శివలాల్ యాదవ్ తన కెరీర్‌కు అడ్డుపడ్డాడని ఆరోపించారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.

'హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నా చిన్నప్పటి నుంచి రాజకీయాలు మొదలయ్యాయి. శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్‌ను టీమిండియాకు ఆడించాలనే ఉద్దేశంతో నన్ను ఇబ్బంది పెట్టారు. అర్జున్ యాదవ్ కన్నా నేను మెరుగ్గా ఆడుతుండటంతో నన్ను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశారు' అని రాయుడు పేర్కొన్నారు. బీసీసీఐ జోక్యం చేసుకుంటేనే పరిస్థితి మారుతుంది. లేకుంటే హెచ్‌సీఏను ఎవ్వరూ బాగు చేయలేరు.

2003-04లో భారత్-ఏ తరఫున అద్భుతంగా ఆడాను. కానీ 2004లో సెలక్షన్ కమిటీ మారడం, శివలాల్ యాదవ్ సన్నిహితులు ప్యానెల్‌లోకి రావడంతో నాకు అవకాశాలు దక్కలేదు. నన్ను ఎందుకు ఎంపిక చేయలేదని అడగటం కూడా తప్పు అయ్యింది. నాలుగేళ్లపాటు ఎవర్నీ నాతో మాట్లాడనీయకుండా చేశారు. మ్యాచ్‌కు ముందు రోజు శివలాల్ యాదవ్ తమ్ముడు తాగి వచ్చి ఇంటి ముందు బండ బూతులు తిట్టేవాడు. నన్ను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు.

Read more: పొలిటికల్ గ్రౌండ్‌లోకి క్రికెటర్ అంబటి.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ?

Tags:    

Similar News