Women's T20 World Cup : ఐసీసీ కీలక నిర్ణయం.. మ్యాచ్ అఫీషియల్స్‌గా అందరూ మహిళలే
మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నది.
దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నది. యూఏఈ వేదికగా వచ్చే నెల 3 నుంచి టోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ మ్యాచ్‌ల బాధ్యతలను మహిళలకే అప్పగించింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ అఫీషియల్స్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ప్యానెల్‌లో పూర్తిగా మహిళలనే ఎంపిక చేయడం గమనార్హం.
13 మంది మ్యాచ్ అఫీషియల్స్‌తో ప్యానెల్‌ను ప్రకటించగా.. అందులో 10 మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు. ఇటీవల ద్వైపాక్షిక సిరీస్‌లు, ఇతర క్రికెట్ టోర్నీల్లో వారి ఫామ్ ఆధారంగా అర్హులైన వారినే ఎంపిక చేసినట్టు ఐసీసీ తెలిపింది. భారత్ నుంచి అంపైర్‌గా వృందా రతి, రిఫరీగా జీఎస్ లక్ష్మి ఎంపికయ్యారు. లక్ష్మి గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు రిఫరీగా వ్యవహరించింది.
అంపైర్ల బృందంలో ఆస్ట్రేలియాకు చెందిన క్లైరో పోలోసాక్ అందరికంటే అనుభవజ్ఞురాలు. అంపైర్‌గా ఆమెకు ఇది 5వ టీ20 వరల్డ్ కప్. అలాగే, జింబాబ్వేకు చెందిన సారాహ్ దంబనవన తొలిసారిగా మహిళల టీ20 ప్రపంచకప్‌లో అంపైర్‌గా వ్యవహరించనుంది.
మ్యాచ్ రిఫరీలు : జీఎస్ లక్ష్మి, శాంద్రే ఫ్రిట్జ్, మిచెల్ పెరీరా
అంపైర్లు : రెన్ అగెన్‌బ్యాగ్, కిమ్ కాటన్, సారాహ్ దంబనవన, అన్నా హ్యారీస్, నిమలి పెరీరా, క్లెయిరో పోలోసాక్, వృందా రతి, సూ రెడ్‌ఫెర్న్, ఎలోసి షెరిడాన్, జాక్విలిన్ విలియమ్స్.