పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్లు..
భారత అథ్లెట్లు అక్ష్‌దీప్ సింగ్, ప్రియాంక గోస్వామి 20 కి.మీ రేస్ వాకింగ్‌లో పారిస్ ఒలింపిక్స్-2024తోపాటు ఈ ఏడాది జరగబోయే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు
రాంచీ: భారత అథ్లెట్లు అక్ష్‌దీప్ సింగ్, ప్రియాంక గోస్వామి 20 కి.మీ రేస్ వాకింగ్‌లో పారిస్ ఒలింపిక్స్-2024తోపాటు ఈ ఏడాది జరగబోయే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. జార్ఖండ్‌లో మంగళవారం జరిగిన నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ అర్హత ప్రమాణాలను సాధించారు. పురుషుల విభాగంలో అక్ష్‌దీప్ సింగ్ 20 కి.మీ రేస్ వాక్‌ను గంట 19 నిమిషాల 55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకం గెలుచుకోవడంతోపాటు జాతీయ రికార్డును నెలకొల్పాడు.
2021లో సందీప్ కుమార్(1:20:16) పేరిట ఉన్న నేషనల్ రికార్డును అక్ష్‌దీప్ బద్దలు కొట్టాడు. పారిస్ ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలంటే రేస్‌ను గంట 20 నిమిషాల 10 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్ష్‌దీప్ సింగ్ అర్హత ప్రమాణాలను బ్రేక్ చేసి బెర్త్‌లు ఖాయం చేసుకున్నాడు. రజతం సాధించిన సురాజ్ పన్వార్ ఒక సెకన్ తేడాతో తృటిలో బెర్త్‌ను కోల్పోయాడు. అలాగే, ఉమెన్స్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ అర్హత సాధించాలంటే గంట 29 నిమిషాల 44 సెకన్లలో వాక్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ ప్రియాంక గోస్వామి గంట 28 నిమిషాల 50 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని స్వర్ణంతో మెరవడంతోపాటు పారిస్ ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. నేటితో నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్ ముగుస్తుంది. 35 కి.మీ రేస్ వాక్ ఈవెంట్‌లో మరికొంత మంది అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ బెర్త్‌లను సాధించే అవకాశం ఉంది.