అండర్సన్‌ విజయంతో.. 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు

ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. 41 ఏళ్ల సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు తెరదించాడు.

Update: 2024-07-12 13:37 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. 41 ఏళ్ల సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు తెరదించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. వెస్టిండీస్‌‌తో తొలి టెస్టును తన చివరి మ్యాచ్‌గా ప్రకటించిన అతను విజయంతో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఐకానిక్ లార్డ్స్ స్టేడియంలో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అతను అదే స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడటం విశేషం. తన ఆఖరి మ్యాచ్‌లో కూడా అండర్సన్ సత్తాచాటాడు. విండీస్‌పై ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెటే తీసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లుతో చెలరేగి ప్రత్యర్థి ఓటమికి కారణమయ్యాడు.

ఆఖరి మ్యాచ్‌ ఆద్యంతం అభిమానులు అండర్సన్‌ను ఉత్సాహపరిచారు. ఇరు జట్ల ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. అభిమానులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. కాగా, 2002లో అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 188 టెస్టుల్లో 704 వికెట్లు తీశాడు. సుదీర్ఘ ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు అతని పేరిటే ఉంది. 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో హయ్యెస్ట్ వికెట్ టేకర్ జాబితాలో అతనిది మూడో స్థానం. ముత్తయ్య మురళీధరన్(1347), షేన్ వార్నర్(1001) తర్వాతి స్థానంలో అండర్సన్ 987 వికెట్లతో ఉన్నాడు. 


Similar News