బంగ్లాపై పట్టు బిగించిన భారత్.. విజయం దిశగా యువ జట్టు
అండర్-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి గ్రూపు మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు విజయం దిశగా దూసుకెళ్తున్నది.
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా వేదికగా ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి గ్రూపు మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు విజయం దిశగా దూసుకెళ్తున్నది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. బంగ్లాదేశ్ ముందు 252 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఛేదనకు దిగిన బంగ్లాను భారత బౌలర్లు ముప్పుతిప్పులు పెడుతున్నారు. కట్టుదిట్టమైన భారత బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా జట్టు 50 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్పిన్నర్ సౌమీ పాండే వరుస ఓవర్లలో ఓపెనర్ రెహ్మాన్(14)తోపాటు రిజ్వాన్(0)లను పెవిలియన్ పంపాడు. మరో ఓపెనర్ జిషన్ ఆలమ్(14)ను రాజ్ లింబాని అవుట్ చేయగా.. అర్షిన్ కులకర్ణి బౌలింగ్‌లో అహ్రార్ అమీన్(5) వికెట్ల ముందు దొరికిపోయాడు. బంగ్లాదేశ్ ఇంకా 201 పరుగులు వెనకబడి ఉన్నాయి.
రాణించిన ఆదర్శ్ సింగ్, ఉదయ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో బంగ్లా ముందు 252 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(7)తోపాటు ముషీర్ ఖాన్(3) నిరాశపర్చడంతో 31 పరుగులకే భారత్ రెండు వికెట్ఉ కోల్పోయింది. ఈ సమయంలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ ఇన్నింగ్స్ నిర్మించారు. బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ వికెట్ల మధ్య పరుగులు తీస్తూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం పెంచారు. ఈ క్రమంలో ఆదర్శ్ సింగ్, ఉదయ్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. అంతేకాకుండా, మూడో వికెట్‌కు ఈ జోడీ 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రిజ్వాన్ బౌలింగ్‌లో ఆదర్శ్ సింగ్ క్యాచ్ అవుటవడంతో ఈ జోడీకి తెరపడింది. కాసేపటికే ఉదయ్ కూడా వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత తెలుగు కుర్రాడు ఆరవెల్లి అవనీశ్ కీలక పరుగులు జోడించాడు. 17 బంతుల్లో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. సచిన్ దాస్(26 నాటౌట్), ప్రియాన్ష్ మోలియా(23) విలువైన పరుగులు జోడించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మారుఫ్ మ్రిదా 5 వికెట్లతో సత్తాచాటాడు.