వరల్డ్ క్రికెట్‌లో పెను సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఐర్లాండ్

వరల్డ్ క్రికెట్‌లో ఐర్లాండ్ పెను సంచలనం సృష్టించింది. టీ20ల్లో సౌతాఫ్రికాను తొలిసారి ఓడించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

Update: 2024-09-30 12:48 GMT

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ క్రికెట్‌లో ఐర్లాండ్ పెను సంచలనం సృష్టించింది. టీ20ల్లో సౌతాఫ్రికాను తొలిసారి ఓడించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అబుదాబి వేదికగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 క్రికెట్‌లో సఫారీలపై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. అడైర్ బ్రదర్స్(రాస్ అడైర్(100), మార్క్ అడైర్(4/31)) ఐర్లాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 195/6 స్కోరు చేసింది. రాస్ అడైర్(100) మెరుపు శతకంతో సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ స్టిర్లింగ్(52) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు.

అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 185/9 స్కోరుకే పరిమితమైంది. మార్క్ అడైర్(4/31), గ్రాహం హ్యుమ్(3/25) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. చివరి 12 బంతుల్లో దక్షిణాఫ్రికా విజయానికి 23 పరుగులు కావాల్సి ఉండగా.. మార్క్ అడైర్ 19వ ఓవర్‌లో మూడు వికెట్లు, హ్యుమ్ 20వ ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. రీజా హెండ్రిక్స్(51), మాథ్యూ బ్రీట్జ్కే(51) రాణించగా.. ర్యాన్ రికెల్టన్(36) పర్వాలేదనిపించాడు. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ విజయంతో ఐర్లాండ్ రెండు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేయగా.. ట్రోఫీని ఇరు జట్లు పంచుకోనున్నాయి.

వరల్డ్ క్రికెట్‌లో ఐర్లాండ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది. మార్చిలో అఫ్గాన్, పాక్ జట్లకు షాకిచ్చిన ఆ జట్టు తాజాగా దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. మరోవైపు, టీ20 వరల్డ్ కప్ అనంతరం పేలవ ప్రదర్శన చేస్తున్న సౌతాఫ్రికా వెస్టిండీస్, అఫ్గాన్ జట్ల చేతిలో సిరీస్‌లను కోల్పోయింది.

Tags:    

Similar News