అథ్లెట్ల డిమాండ్లకు అంగీకారం.. మంత్రి ఠాకూర్ రాతపూర్వక హామీ

సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్ల సమస్య కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Update: 2023-06-07 16:51 GMT

న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్ల సమస్య కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు ఆరు గంటల పాటు జరిపిన చర్చలు ఆశాజనకంగా ముగిశాయి. రెజ్లర్ల డిమాండ్‌లకు అంగీకరించిన మంత్రి పలు చర్యలు తీసుకుంటానంటూ రాతపూర్వక హామీ ఇచ్చారు. దీంతో ఈ నెల 15వ తేదీ వరకు ఆందోళనలు నిలిపివేసేందుకు రెజ్లర్లు అంగీకరించారు. ఆలోపు సానుకూల స్పందన రాకుంటే ఆందోళనలను మళ్లీ ప్రారంభిస్తామన్నారు. శనివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రెజ్లర్లు రహస్యంగా జరిపిన సమావేశం నేపథ్యంలో క్రీడా మంత్రి ఠాకూర్ తో చర్చలకు మార్గం ఏర్పడింది. అమిత్ షాతో శనివారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలను రహస్యంగా ఉంచాలని నిర్ణయించినప్పటికీ మీడియాకు లీగ్ అయింది.

రెజ్లర్ల డిమాండ్లు.. మంత్రి హామీలు..

- లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను ఈ నెల 15వ తేదీలోపు అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీలోపు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని, కోర్టు నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని క్రీడా మంత్రి హామీ ఇచ్చారు.

- ఈ నెల 30వ తేదీ లోపు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ ఎన్నికల్లో పాల్గొనరాదన్న రెజ్లర్ల డిమాండ్ ను ఆమోదించారు.

- మహిళ నేతృత్వంలో డబ్ల్యూఎఫ్ఐ అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్ ను మంత్రి అంగీకరించారు.

- ఆందోళనల సందర్భంలో తమపై పెట్టిన కేసులను కొట్టేయాలన్న రెజ్లర్ల డిమాండ్ కు మంత్రి అంగీకరించారు. ఈ నెల 28వ తేదీలోగా కేసులు తొలగిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News