క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు.. ఒక్క బాల్‌కు 18 రన్స్

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా సలేమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదయ్యింది.

Update: 2023-06-14 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా సలేమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదయ్యింది. సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ చెపాక్ సూపర్ గల్లీస్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు. చెపాక్ సూపర్ గిల్లీస్ ఇన్నింగ్స్ చివరి బంతికే ఈ 18 పరుగులు వచ్చాయి. ఆ టీమ్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులతో ఉండగా.. చివరి బంతిని అభిషేక్ వేశాడు. బ్యాటర్ క్లీన్ బౌల్డ్ కావడంతో అభిషేక్ సెలబ్రేట్ చేసుకున్నాడు.

అయితే అది నోబాల్ అని తేలడంతో అసలు కథ అప్పుడు మొదలైంది. మొదటి బాల్ నోబాల్‌, ఆ తర్వాత నోబాల్‌ వేస్తే ఈసారి సిక్సర్‌, తర్వాతి బంతి మళ్లీ నోబాల్‌.. రెండు పరుగులు.. అనంతరం వైడ్‌ బాల్‌.. ఇక చివరగా వేసిన సరైన బంతికి మరో సిక్సర్‌.. ఇలా కేవలం ఆఖరి బంతికి మూడు నోబాల్స్‌, ఒక వైడ్‌ సహా రెండు సిక్సర్లు, రెండు పరుగులు మొత్తంగా 18 పరుగులు వచ్చాయి. ఈ దెబ్బతో సంజయ్‌ యాదవ్‌ కేవలం ఆఖరి ఓవర్లోనే తాను ఎదుర్కొన్న ఆరు బంతుల్లో 18 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చివరి బంతికి 18 పరుగులు..

- 20వ ఓవర్ చివరి బంతికి బ్యాటర్ బౌల్డ్ అయినా అది నోబాల్ అని తేలడంతో ఒక పరుగు వచ్చింది.

- తర్వాత బంతి కూడా నోబాల్ కాగా బ్యాటర్ సిక్స్ కొట్టాడు. దీంతో 8 పరుగులు అయ్యాయి.

- ఆ తర్వాతి బంతి కూడా నోబాల్ వేశాడు అభిషేక్. ఈ బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి.

- ఈ సారైనా ఇన్నింగ్స్ ఫినిష్ చేస్తాడనుకుంటే అభిషేక్ వైడ్ వేశాడు. ఆ బంతికి 12 పరుగులు అయ్యాయి.

- చివరి బాల్.. నోబాల్, వైడ్ కాకుండా లీగల్ డెలివరీ వేయగా.. అది కాస్తా సిక్స్ వెళ్లింది. దీంతో చివరి బంతికి మొత్తం 18 పరుగులు వచ్చాయి.

ఇక 20వ ఓవర్లో మొత్తంగా 26 పరుగులు ఇచ్చాడు అభిషేక్. దీంతో 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులుగా ఉన్న చెపాక్ టీమ్ స్కోరు.. 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లకు 21 పరుగులకు చేరింది. తన ఈ బౌలింగ్ ప్రదర్శనపై అభిషేక్ కూడా అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో చెపాక్‌ సూపర్‌ గల్లీస్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెపాక్‌ సూపర్‌ గల్లీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సలెమ్‌ స్పార్టాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది.


Similar News