అదరగొట్టిన అభిమన్యు ఈశ్వరన్..
ఉత్తరాఖండ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్(151 బ్యాటింగ్, 212 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు.ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున అజేయ భారీ శతకంతో సత్తాచాటాడు.
దిశ, స్పోర్ట్స్ : ఉత్తరాఖండ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్(151 బ్యాటింగ్, 212 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు.ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున అజేయ భారీ శతకంతో సత్తాచాటాడు. రెండు రోజులు పూర్తిగా ముంబై ఆధిపత్యమే కొనసాగగా.. మూడో రోజు అభిమన్యు సంచలన ఇన్నింగ్స్‌తో ముంబై జట్టుకు రెస్ట్ ఆఫ్ ఇండియా దీటుగా బదులిస్తున్నది. మొదట ఓవర్‌నైట్ స్కోరు 536/9తో గురువారం ఆట కొనసాగించిన ముంబై ఒక్క పరుగు మాత్రమే జోడించి ఆఖరి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 537 రన్స్‌కు ఆలౌటైంది.
డబుల్ సెంచరీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్) అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియాలో కీలక బ్యాటర్లు నిరాశపరిచారు. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(9), దేవదత్ పడిక్కల్(16) నిరాశపర్చగా.. సాయి సుదర్శన్(32), ఇషాన్ కిషన్(38) భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయారు. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ అభిమన్యు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. సాయి సుదర్శన్, పడిక్కల్, ఇషాన్ కిషన్ సహకారంతో ఇన్నింగ్స్ నిర్మించాడు. అతను క్రీజులో పాతుకపోవడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. అతనితోపాటు ధ్రువ్ జురెల్(30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసె సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా 289/4 స్కోరుతో నిలిచింది. ఆ జట్టు ఇంకా 248 పరుగులు వెనుకబడి ఉన్నది.