US T10 League 2023: ఆసీస్ మాజీ కెప్టెన్ విధ్వంసకర బ్యాటింగ్.. ఓవర్‌లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్‌

యూఎస్‌ మాస్టర్‌ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌, న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Update: 2023-08-22 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూఎస్‌ మాస్టర్‌ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌, న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫించ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ తన కాలిఫోర్నియా నైట్స్‌ జట్టు మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కాలిఫోర్నియా నైట్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

కాలిఫోర్నియా బ్యాటర్లలో ఫించ్‌ (75 )తో పాటు మిలాంద్‌ కుమార్‌(27) పరుగులతో రాణించాడు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్‌ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓ‍వర్లలో ఛేదించింది. న్యూజెర్సీ బ్యాటర్లలో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్‌ ఓజా(25) పరుగులతో రాణించాడు.


Similar News